Venkaiah Naidu: కుల మతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్దతి కాదు: వెంకయ్యనాయుడు
- విజ్ఞాన్ వర్సిటీలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వెంకయ్య
- కుల మతాల ఆధారంగా నేతలను ఎన్నుకోవడం సరైన పధ్ధతి కాదని వ్యాఖ్య
- మోదీ కారణంగానే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్న మాజీ ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల్లో తన కోసం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం, కుల మతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ప్రపంచం అంతా భారత్ వైపు చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని వెంకయ్య అన్నారు. భారత్ స్నేహం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, రష్యా, బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులను కలవడం ఎంతో ఆనందంగా ఉందని వెంకయ్య అన్నారు.