Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
- అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
- స్రవంతికి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
- సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడిని రగుల్చుతోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలోనే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మునుగోడులో పోటీ చేసే తమ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడులో హస్తం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేయనున్నారు. స్రవంతి పేరును నేడు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
కాగా, మునుగోడు టికెట్ కోసం పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి కూడా పోటీపడినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి వైపు మొగ్గుచూపింది. పార్టీ సీనియర్లు కూడా స్రవంతి అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్టు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ, ఫలితాల వెల్లడి తేదీలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మునుగోడు కోసం హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి.
బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్టే. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గులాబీ దళం తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రియతమ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి గారి ఆశీస్సులు తమకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.