smart phone: ఫోన్ పనితీరు నిదానించిందా..? ఇలా చేస్తే వేగం పుంజుకుంటుంది!
- ఫోన్లో ప్రతి పనికీ క్యాచే రూపంలో నిల్వ
- దీనివల్ల ఫోన్ పై అదనపు భారం
- క్యాచేను డిలీట్ చేసుకోవాలి
- అరుదుగా ఉపయోగించే యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి
స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని కాదేమో? అనే విధంగా జీవనశైలి మారిపోయింది. దాదాపు అన్ని చెల్లింపులకు స్మార్ట్ ఫోన్లనే ఉపయోగిస్తున్న రోజులు ఇవి. అన్ని రకాల జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో సేవ్ చేసుకోవడం, వాటిని ఇతరులతో షేర్ చేసుకోవడం సాధారణమైపోయింది. అంతేకాదు, ప్రతి విషయాన్ని గూగుల్ లో శోధించి తెలుసుకోవడం కూడా నేడు అందరూ చేసే పనే. ఇవన్నీ కలసి ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అయినా డేటా లోడ్ ఎక్కువై ఒక్కోసారి నిదానిస్తుంటుంది. అటువంటప్పుడు తిరిగి ఫోన్ వేగాన్ని సంతరించుకునేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
ఫోన్ క్యాచే
ఫోన్ లో చేసే అన్ని టాస్క్ లకు సంబంధించిన క్యాచే ‘ర్యామ్’ లో సేవ్ అవుతుంది. ఉదాహరణకు ఫోన్ బ్రౌజర్ లో ఒక వెబ్ సైట్ తెరిచామనుకోండి.. ఆ వెబ్ సైట్ లో మనం చూసే హిస్టరీ అంతా క్యాచే రూపంలో సేవ్ అవుతుంది. దీనివల్ల తదనంతరం మరోసారి అదే వెబ్ సైట్ చూసే సమయంలో వేగంగా లోడ్ అవుతుంది. ఇదంతా కొంత మెమొరీ రూపంలో ఫోన్ ర్యామ్ పై భారాన్ని మోపుతుంది. అందుకని క్యాచే లేదా జంక్ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో, స్టోరేజీలో, క్యాచే ను సెలక్ట్ చేసుకోవాలి. క్లియర్ క్యాచే ఆప్షన్ ను సెలక్ట్ చేసి ఓకే చేయాలి. డిలీట్ అయిపోతుంది.
ఉపయోగించని యాప్స్
వివిధ అవసరాల కోసం యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని వదిలేస్తుంటాం. ఇలా అవసరం లేని యాప్స్ ఎక్కువైతే ఫోన్ ర్యామ్ పై భారం పెరిగి వేగం తగ్గుతుంది. అందుకని తరచుగా ఉపయోగించని యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడో కానీ ఉపయోగించే వాటి కోసం యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి బదులు వాటి వెబ్ పోర్టల్ ను సందర్శిస్తే సరి. ఫోన్లో కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి. వాటిని డిలీట్ చేయలేరు. దీనికి బదులు డిసేబుల్ చేసుకోవచ్చు.
లైటర్ ఎడిషన్ యాప్స్
అందరి దగ్గర ఖరీదైన, అధిక ర్యామ్ తో కూడిన ఫోన్లు ఉండాలనేమీ లేదు. కనుక ఫోన్ సామర్థ్యంపై భారం పడకుండా ఉండేందుకు లైటర్ ఎడిషన్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు లైట్ యాప్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రధాన యాప్స్ తో పోలిస్తే ఇవి తక్కువ స్టోరేజీ, మెమోరీని తీసుకుంటాయి.
యానిమేషన్స్
మనం చూసే కంటెంట్ లో యానిమేషన్స్ లోడ్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఫోన్ పై లోడ్ కూడా పెరుగుతుంది. అందుకని యానిమేషన్స్ ఆఫ్ చేసుకోవడం చివరి మార్గం. ఇలా చేస్తే వీక్షణ భావన అంత సౌకర్యం అనిపించకపోవచ్చు. అందుకే చివరిగానే దీన్ని ఉపయోగించుకోవాలి. సెట్టింగ్స్ లో, అబౌట్ ఫోన్ లో, బిల్డ్ నంబర్ పై ఏడు సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడు డెవలపర్ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో డిసేబుల్ లేదా రెడ్యూస్ యానిమేషన్స్ ను యాక్టివేట్ చేసుకోవాలి.