iPhone 14: అమెరికా నుంచి చౌకగా ఐఫోన్ తీసుకురమ్మని అడగకండి..ఎందుకంటే..!
- రెండు దేశాల మధ్య ఫోన్ ధరల్లో వ్యత్యాసం
- అమెరికాలోని ఫోన్లలో ఫిజికల్ సిమ్ ఉండదు
- ఈ -సిమ్ తో ఉపయోగించుకోవాల్సిందే
- ఫిజికల్ సిమ్ అంత సౌకర్యం ఈ సిమ్ లో ఉండదు
ఐఫోన్ మన కరెన్సీలో కావాలంటే రూ.70-80 వేలు అవుతుంది. అదే అమెరికాలో అయితే తక్కువ. మన దేశానికి, అమెరికాకు మధ్య ఫోన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. దీంతో అమెరికాలో తమ బంధువు లేదా ఫ్రెండ్ ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే, స్వదేశానికి వచ్చేటప్పుడు ఓ ఐఫోన్ పట్టుకురారూ? అని కొందరు అడిగి తెప్పించుకుంటారు.
సాధారణంగా మన దగ్గర ఐఫోన్లపై పన్ను ఎక్కువ. అందుకే ధర ఎక్కువగా ఉంటుంది. బంధువు లేదా స్నేహితుడి రూపంలో తక్కువ ధరకే ఐఫోన్ యజమాని అయిపోదామనుకోకండి. ఎందుకంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో ఫిజికల్ సిమ్ ట్రే ఉండదు. అక్కడి వారు పూర్తిగా ఈ సిమ్ తోనే ఫోన్ వాడుకోవాల్సి ఉంటుంది. దీంతో అక్కడి నుంచి తెప్పించుకునే ఐఫోన్ 14ను ఇక్కడ కూడా ఈ సిమ్ తోనే వాడుకోవాల్సి ఉంటుంది. జియో, ఎయిర్ టెల్ ఈ సిమ్ సర్వీసు అందిస్తున్నాయి. ఐఫోన్ 14 భారత వేరియంట్ లో ఫిజికల్ సిమ్ ట్రే ఉంటుంది.
ఒక్కసారి ఈ సిమ్ కు మారిపోతే, ఫిజికల్ సిమ్ పనిచేయదు. దాంతో ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కు ఫిజికల్ సిమ్ తో తేలిగ్గా మారిపోవడం కుదరదు. ఫోన్ నుంచి సిమ్ బయటకు తీసే అలవాటు లేని వారికి ఈ సిమ్ అనుకూలమే. ఒకవేళ మళ్లీ ఫిజికల్ సిమ్ కు మారాలంటే.. నెట్ వర్క్ ప్రొవైడర్ స్టోర్ ఆధార్ కార్డుతో వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.