Amber Greece: యూపీలో రూ.10 కోట్ల విలువైన ఆంబర్ గ్రిస్ పట్టివేత... తిమింగలం వాంతికి అంత ధర ఎందుకంటే...!
- లక్నోలో టాస్క్ ఫోర్స్ దాడులు
- 4.12 కిలోల తిమింగలం వాంతి స్వాధీనం
- నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
- పెర్ఫ్యూమ్ లు, ఔషధాల తయారీలో వినియోగం
ఉత్తరప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 4.12 కిలోల ఆంబర్ గ్రిస్ (తిమింగలం వాంతి) స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని ఖరీదు రూ.10 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఆంబర్ గ్రిస్ కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (యూపీఎస్టీఎఫ్) లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఎంతో సువాసన, ప్రత్యేక గుణాలు కలిగిన తిమింగలం వాంతిని సుగంధ పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తిమింగలం వాంతితో తయారైన పెర్ఫ్యూమ్ లు అత్యంత ఖరీదైనవిగా చలామణీలో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 ప్రకారం తిమింగలం వాంతి అమ్మకాలపై నిషేధం ఉంది.
తిమింగలాల్లో ముఖ్యంగా స్పెర్మ్ వేల్ రకం తిమింగలాల నోటి నుంచి వచ్చే మైనం వంటి చిక్కని పదార్థాన్ని ఆంబర్ గ్రిస్ లేక గ్రే ఆంబర్, లేక నీటిపై తేలే బంగారం అని పిలుస్తుంటారు. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థం అరుదైనది, అత్యంత విశిష్టమైనది కావడంతో అతి భారీ ధర పలుకుతుంది.
ఈ ఏడాది జులైలో కేరళ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా రూ.28 కోట్ల విలువైన ఆంబర్ గ్రిస్ వారి కంటపడగా, దాన్ని వారు అధికారులకు అప్పగించారు. ఈ ఆంబర్ గ్రిస్ తిమింగలాల జీర్ణవ్యవస్థ నుంచి నోటి ద్వారా వెలుపలికి విసర్జితమయ్యే ఓ పదార్థం. ఇది తిమింగలం పేగుల్లో ఉత్పత్తి అవుతుంది.