Team India: ఆసియా కప్​ లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ పాకిస్థాన్ పైనే!

 Can India qualify for final after defeats to Pakistan and Sri Lanka

  • ఫైనల్ చేరేందుకు ఇప్పటికీ టీమిండియాకు అవకాశాలు
  • తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ పాక్ ఓడిపోవాలి
  • ఆఫ్ఘనిస్థాన్ పై భారీ తేడాతో గెలిస్తే భారత్ కు చాన్స్
  • నేడు ఆప్ఘన్, పాక్ మధ్య పోరుపై అందరి ఫోకస్

ఆసియా కప్‌ సూపర్ 4లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో ఏడుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఈ సారి కనీసం ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టేలా కనిపిస్తోంది. దాయాది పాకిస్థాన్ చేతిలో ఓటమి చాలదన్నట్టు పెద్దగా అంచనాలు లేని శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ భారత్ సాంకేతికంగా ఫైనల్ రేసులో నిలిచింది. కానీ, రోహిత్ సేన తుది పోరు చేరుకోవాలంటే అద్భుతం జరగాలి. దేవుడు కరుణించడంతో పాటు పాకిస్థాన్ కూడా సాయం చేయాల్సి ఉంటుంది.  

ఆసియా కప్‌ సూపర్4 రౌండ్ లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలున్నాయి. బుధవారం పాకిస్థాన్ -ఆప్ఘనిస్థాన్, గురువారం భారత్-ఆఫ్ఘనిస్థాన్, శుక్రవారం శ్రీలంక-పాకిస్థాన్ తలపడుతాయి. ప్రస్తుతానికి, శ్రీలంక తమ 2 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. ఒక విజయంతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉండడగా.. రెండు మ్యాచ్ ల్లో ఓడిన భారత్ మూడో ప్లేస్ లో ఉంది. ఒక మ్యాచ్ లో ఓడిన ఆఫ్ఘన్ తక్కువ రన్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో ఉంది. 

భారత్‌ ఫైనల్ చేరాలంటే పాకిస్థాన్ జట్టు.. ఆప్ఘనిస్థాన్, శ్రీలంకతో జరిగే మ్యాచ్ ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ పై భారత్ గెలవాలి. అప్పుడు శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. భారత్, పాక్, ఆప్ఘన్ ఒక్కో విజయాలతో రెండేసి పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. భారత్ నెట్ రన్ రేట్..  పాక్, ఆఫ్ఘన్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో స్థానంతో ఫైనల్ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో భారత్ భవితవ్యం మన ఆటగాళ్ల కంటే పాకిస్థాన్ చేతుల్లోనే ఉంది అనొచ్చు. ఈ రోజు ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ గెలిస్తే భారత్ ఆశలు ఆవిరి అవుతాయి. పాక్ తో పాటు శ్రీలంక నేరుగా ఫైనల్ చేరుకుంటే.. భారత్, ఆఫ్ఘన్ ఇంటిదారి పడుతాయి.

More Telugu News