Cyrus Mistry: కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణంపై మెర్సిడెస్ బెంజ్ స్పందన ఇదే!
- విచారణ అధికారులకు సహకరిస్తున్నామన్న మెర్సిడెస్ బెంజ్
- రోడ్ సేఫ్టీపై తమ వినియోగదారుల్లో అవగాహన పెంచుతామని వ్యాఖ్య
- మిస్త్రీ, పండోలే మృతి చెందడం బాధాకరమన్న బెంజ్
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురయింది. ప్రమాద సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో నలుగురు వ్యక్తులు అందులో ప్రయాణిస్తున్నారు. వీరిలో మిస్త్రీతో పాటు మరొకరు కూడా మృతి చెందారు. మరోవైపు ఈ ప్రమాదంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్పందించింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది.
వినియోగదారుల గోప్యతను తాము గౌరవిస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. అయితే విచారణ అధికారులకు అవసరమైన సమాచారాన్ని నేరుగా వారికే అందిస్తామని చెప్పింది. తమ వాహనాలకు సరికొత్త భద్రతా ఫీచర్లను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నామని తెలిపింది. రోడ్ సేఫ్టీపై తమ వినియోగదారుల్లో అవగాహనను పెంచే ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పింది. రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే మృతి చెందడం బాధాకరమని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పింది.