Mohammad Hafeez: పాకిస్థాన్ తో మ్యాచ్ ల్లో అశ్విన్ ఆడకపోవడం అఫ్రిది చలవేనట... పాక్ మాజీ కెప్టెన్ దారుణ వ్యాఖ్యలు
- పాక్ తో పోరులో అశ్విన్ కు టీమిండియాలో దక్కని స్థానం
- అశ్విన్ లేకుండానే పాక్ తో భారత్ మ్యాచ్ లు
- 2014 ఆసియా కప్ లో అశ్విన్ బౌలింగ్ లో సిక్సులు కొట్టిన అఫ్రిదీ
- అందుకే అశ్విన్ ను తీసుకోవడంలేదన్న మహ్మద్ హఫీజ్
భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల పాకిస్థాన్ తో భారత్ ఆడిన మ్యాచ్ ల్లో కనిపించకపోవడంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. 2014 ఆసియా కప్ లో అశ్విన్ బౌలింగ్ ను అఫ్రిదీ చీల్చిచెండాడని హఫీజ్ వెల్లడించాడు. అశ్విన్ బౌలింగ్ లో అఫ్రిదీ రెండు వరుస సిక్సర్లు బాదాడని, ఈ కారణంగానే అశ్విన్ ను పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ ల్లో టీమిండియా జట్టులోకి తీసుకోవడంలేదని హఫీజ్ సూత్రీకరించాడు. అందుకు తాను అఫ్రిదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు.
2014 ఆసియా కప్ లో భారత్, పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ జట్టు లక్ష్యఛేదనలో శుభారంభం అందుకుంది. ఇక చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, అఫ్రిది రెండు వరుస సిక్సర్లు బాదడంతో పాక్ ఒక వికెట్ తేడాతో గెలిచింది
ఈ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకునే పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్ పైవ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా హఫీజ్ ట్విట్టర్ లో పంచుకున్నాడు.