Sunil Gavaskar: ధోనీ గురించి మాట్లాడటం ద్వారా కోహ్లీ ఏం ఆశిస్తున్నాడు?: గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
- టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నప్పుడు కేవలం ధోనీ మాత్రమే మెసేజ్ పెట్టాడన్న కోహ్లీ
- ఎవరెవరు టచ్ లోకి రాలేదో వారి పేర్లను కూడా కోహ్లీ చెప్పాలన్న గవాస్కర్
- కెప్టెన్సీ ముగిసిపోయిన అంశం.. సొంత ఆటపై ఫోకస్ చేయాలని హితవు
- తాను కెప్టెన్ గా వైదొలగినప్పుడు కూడా ప్రత్యేకంగా ఎలాంటి మెసేజ్ లు రాలేదన్న గవాస్కర్
గత ఆదివారం ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 60 పరుగులు చేసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలయింది. మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కోహ్లీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
గత ఏడాది టెస్ట్ జట్టు కెప్టెన్ గా తాను వైదొలగిన తర్వాత కేవలం ధోనీ మినహా మరెవరూ స్పందించలేదని చెప్పాడు. కేవలం ధోనీ నుంచి మాత్రమే తనకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని తెలిపాడు. తన ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉందని, టీవీలో తనకు చాలా మంది సలహాలు ఇస్తుంటారని... తన ఫోన్ నంబర్ ఉన్నా ఎవరూ కనీసం మెసేజ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తితో నిజమైన బంధం ఉందనే విషయం ఇలాంటప్పుడే బయటపడుతుందని అన్నాడు.
కోహ్లీ వ్యాఖ్యలపై భారత్ క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్పందించారు. ఆయనతో ఎవరెవరు టచ్ లోకి రాలేదో వారి పేర్లను కోహ్లీ చెప్పాలని అన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో తనకు తెలియదని... తనతో టచ్ లోకి వచ్చిన వ్యక్తి పేరును కోహ్లీ చెప్పినప్పుడు... టచ్ లోకి రాని వ్యక్తుల పేర్లను కూడా చెప్పాలని వ్యాఖ్యానించారు. అప్పుడే ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడటం ద్వారా కోహ్లీ ఏం ఆశిస్తున్నాడని ప్రశ్నించారు. ఎంకరేజ్ మెంట్ ను కోరుకుంటున్నాడా? అని అడిగారు. జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తికి ఎంకరేజ్ మెంట్ ఎందుకని ప్రశ్నించారు.
కోహ్లీ కెప్టెన్సీ అనేది ఇప్పటికే ముగిసిపోయిన చాప్టర్ అని గవాస్కర్ అన్నారు. కెప్టెన్సీని వదులుకున్న ఆటగాడు... తన వ్యక్తిగత ఆటతీరుపై ఫోకస్ చేయడం మంచిదని చెప్పారు. ఇప్పుడు నీవు ఒక క్రికెటర్ గానే జట్టులో ఉన్నావని... ఇప్పుడు కేవలం నీ ఆటపై మాత్రమే ఫోకస్ చేయాలని అన్నారు. కెప్టెన్ గా ఉన్నప్పుడైతే జట్టులోని సభ్యులందరి గురించి ఆందోళన చెందాల్సి ఉంటుందని చెప్పారు. కెప్టెన్సీ ముగిసిందని.. ఇప్పుడు సొంత ఆటపైనే దృష్టిని కేంద్రీకరించడం మేలని సూచించారు.
అంతేకాదు, 1985లో తాను కెప్టెన్సీ నుంచి వైదొలగినప్పటి విషయం గురించి కూడా గవాస్కర్ ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ను గెలిచిన తర్వాత కెప్టెన్సీ నుంచి తాను తప్పుకున్నానని... అప్పుడు తనకు కూడా ప్రత్యేకంగా ఎలాంటి మెసేజ్ లు రాలేదని ఆయన చెప్పారు. అయితే, ఆ రాత్రి తామంతా సెలబ్రేట్ చేసుకున్నామని... ఒకరినొకరు హత్తుకున్నామని... ఇంతకంటే మనం ఏం ఎక్స్ పెక్ట్ చేయగలమని ప్రశ్నించారు.