Virgin Test: నవ వధువుకు పెళ్లయిన తొలిరోజే కన్యత్వ పరీక్ష... విఫలమైందంటూ రూ.10 లక్షలు డిమాండ్ చేసిన అత్తమామలు
- రాజస్థాన్ లో హేయమైన ఘటన
- మే 11న భిల్వారాలో పెళ్లి
- వధువుకు కన్యత్వ పరీక్ష
- కేసు నమోదు చేసిన పోలీసులు
- గతంలో తాను అత్యాచారానికి గురయ్యానన్న వధువు
రాజస్థాన్ లో హేయమైన ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో 24 ఏళ్ల యువతికి పెళ్లయిన తొలిరోజే అత్తమామలు కన్యత్వ పరీక్ష నిర్వహించారు. అయితే కన్యత్వ పరీక్షలో ఆమె విఫలమైందంటూ వారు కుల పంచాయితీ నిర్వహించారు. ఆ యువతి రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన వివాహం మే 11 భిల్వారాలో జరిగిందని, అదే రోజున కన్యత్వ పరీక్ష జరిపారని ఆ యువతి ఆరోపించింది. తాను కన్యత్వ పరీక్షలో విఫలం అయ్యానంటూ భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31న స్థానిక ఆలయంలో కుల పంచాయితీ జరిపి, తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చారని వివరించింది.
కాగా, వివాహానికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురయ్యానని ఆమె మెట్టినింటి వారికి తెలిపిందని, దీనిపై సుభాష్ నగర్ పీఎస్ లో కేసు కూడా నమోదైనట్టు వారికి వివరించిందని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ వారు తనపై దాడి చేసినట్టు ఆరోపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ యువతి మెట్టినింటివారిపై సెక్షన్ 498ఏ, 384, 509, 120బి కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.