Talasani: పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు: మంత్రి తలసాని

Talasani opines on Ganesh Immersion arrangements

  • వినాయక నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేశామన్న తలసాని
  • మూడ్నెల్ల ముందే సమీక్షించామని వెల్లడి
  • ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు
  • ఎవరి ఆరోపణలు పట్టించుకునేది లేదని స్పష్టీకరణ

హైదరాబాద్ లో వినాయక నిమజ్జన విస్తృత ఏర్పాట్లపై ఇప్పటిదాకా అనేక పర్యాయాలు సమీక్షలు జరిపామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పగా ఉండాలని అభిలషించారని, ఆ క్రమంలో హైదరాబాదులో బోనాల పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలో అనేక పండుగలు ఒకలా జరిగితే, తెలంగాణ రాష్ట్రంలో మరోస్థాయిలో జరుపుతున్నామని వివరించారు. 

బతుకమ్మ పండుగ చేస్తారు కానీ, వినాయక చవితి పండుగ చేయరని ఇవాళ కొందరంటున్నారని, పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని తలసాని హితవు పలికారు. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే తామే ఏర్పాట్లు చేస్తాం అంటున్నారు... ఎలా చేస్తారు? ఇంతమంది పోలీసులను ఎక్కడ్నించి తీసుకువస్తారు? అని ప్రశ్నించారు. 

చిన్న విగ్రహాల కోసం చిన్న పాండ్ లు ఏర్పాటు చేస్తే అవి మురుగునీరు అంటున్నారని తలసాని ఆరోపించారు. మాట్లాడితే హిందువుల పండుగలు అంటున్నారు... మరి మేమెవరం? అంటూ ప్రశ్నించారు. పండుగలు జరపడంపై ప్రభుత్వానికి ఎవరైనా చెప్పాలా? అది మా బాధ్యత అంటూ స్పష్టం చేశారు.

వినాయకచవితికి సంబంధించి మూడు నెలల ముందే సమీక్షించామని, అన్ని ఏర్పాట్లపై చర్చించామని తలసాని వెల్లడించారు. ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తాము ఎంతో శ్రమిస్తున్నప్పటికీ, కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని తలసాని పేర్కొన్నారు. 

తెలంగాణ రాకముందు వినాయకచవితి నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉండేవో అందరికీ తెలుసని, ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా వల్ల గత రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఈసారి నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేశామని, ఎవరి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని తలసాని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News