Congress: రూ.500 కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ... గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీలు

Congress party election vows to Gujarath people
  • త్వరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు
  • ఆకర్షణీయమైన హామీలతో రంగంలోకి కాంగ్రెస్ పార్టీ
  • తాము గుజరాత్ ప్రజల కోసమే పనిచేస్తామన్న రాహుల్
  • బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు కోసం పనిచేయబోమని స్పష్టీకరణ
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీతో అమీతుమీకి సిద్ధమైంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎదురవుతున్న పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన హామీలను రూపొందించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. గుజరాత్ లోని సోదర సోదరీమణులందరికీ ఈ మేరకు మాటిస్తున్నాం అంటూ పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక అంశాలను ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల హామీలు...

1. రూ.500 కే గ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
3. రూ.10 లక్షల ఖర్చు వరకు ఉచిత వైద్యం
4. రూ.3 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ
5. రాష్ట్రంలో 3 వేల ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు
6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
7. లీటర్ కు రూ.5 చొప్పున పాల ఉత్పత్తిదారులకు సబ్సిడీ 
8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 భృతి.

ఇవే తమ తీర్మానాలు అని, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము గుజరాత్ ప్రజల కోసమే పనిచేస్తామని, బీజేపీలాగా కేవలం ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం పనిచేయబోమని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.
Congress
Rahul Gandhi
Gujarath
Elections

More Telugu News