Maharashtra: మరో 14 రోజుల పాటు జైల్లోనే సంజయ్ రౌత్.. బెయిల్‌కూ దరఖాస్తు చేసుకోని శివసేన ఎంపీ
- పాత్రచాల్ కుంభకోణంలో రౌత్ అరెస్ట్
- తొలుత విధించిన రిమాండ్ సోమవారంతో ముగిసిన వైనం
- దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని కోరిన ఈడీ
మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మరో 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ఈడీ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 19 దాకా రౌత్ జైల్లోనే ఉండనున్నారు.
పాత్రచాల్ కుంభకోణంలో రౌత్ పాత్ర ఉందని ఆరోపించిన ఈడీ అధికారులు... రౌత్ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లలో పలు దఫాలుగా సోదాలు చేసిన తర్వాత మనీ ల్యాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయగా... ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
కోర్టు తొలుత విధించిన రిమాండ్ గడువు సోమవారంతో ముగియగా... ఈడీ అధికారులు ఆయనను నేడు కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కానందున రౌత్‌ను తిరిగి జ్యుడిషియల్ రిమాండ్‌లోనే ఉంచాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అదే సమయంలో బెయిల్ ఇవ్వాలంటూ రౌత్ పిటిషన్ ఏమీ దాఖలు చేయలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు రౌత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.