night sky sanctuary: దేశంలో మొదటిసారిగా ‘నైట్ స్కై శాంక్చుయరీ’
- లడఖ్ లోని హాన్లే వద్ద త్వరలో ఏర్పాటు
- అందుబాటులో ఆప్టికల్, ఇన్ ఫ్రారెడ్, గామా టెలిస్కోపులు
- ఖగోళ పరిశోధనలకు అనుకూల వసతులు
- తద్వారా ఖగోళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఆలోచన
దేశంలోనే మొట్ట మొదటిసారిగా, నైట్ స్కై శాంక్చుయరీ లడఖ్ లో ఏర్పాటు కానుంది. ఖగోళ పరిశోధకుల సందర్శనకు వీలుగా దీన్ని తీర్చిదిద్దుతారు. తద్వారా ఖగోళ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లడఖ్ లోని చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోనే హాన్లే వద్ద డార్క్ స్కై రిజర్వ్ ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు చేయనుంది.
ఇది అత్యంత ఎత్తయిన ప్రదేశం కావడంతో ఖగోళ పరిశోధనలకు అనుకూలమైన కేంద్రం కానుంది. ఇక్కడ ఆప్టికల్, ఇన్ ఫ్రారెడ్, గామా రే టెలిస్కోపులు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రం ఏర్పాటుకు వీలుగా లడఖ్ కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది.
హాన్లే ప్రాంతం మానవ సంచారానికి దూరంగా ఉంటుంది. అక్కడ ఆకాశం స్పష్టమైన వీక్షణకు అనుకూలమైన వాతావరణంతో ఉంటుంది. పైగా ఏడాది పాటు పొడి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.