India: భారత్ ఆ సమస్యను పరిష్కరించగలదు.. కానీ పెద్దగా ఏమీ చేయలేదు: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

India should help on Rohingyas Issue says Shaik Hasina

  • రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యగా మారారని వెల్లడి
  • భారత్ పెద్ద దేశమని, కొందరు శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చన్న షేక్ హసీనా
  • తమ దేశం పరిస్థితి శ్రీలంకలా మారే అవకాశమే లేదని వ్యాఖ్య

భారత్ చాలా పెద్ద దేశమని.. కొందరు రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు. అయినా భారత్ పెద్దగా ఏమీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని.. శరణార్థులు 11 లక్షల మందికిపైగా ఉండటంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. శనివారం ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ చాలా సాయం చేసినా..
కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ తమకు చాలా సాయం చేసిందని షేక్ హసీనా ప్రశంసించారు. ఇప్పుడు కూడా రోహింగ్యాల సమస్యను భారత్ పరిష్కరించి.. తమకు అండగా నిలవగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది భారమని తమకు తెలుసని.. భారత్ కొందరు శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చని సూచించారు. మానవీయ కోణంలోనే తాము రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చామని.. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించామని తెలిపారు. అయితే వారు ఏన్నాళ్లుంటారని.. అందుకే వారిని క్యాంపుల్లో ఉంచామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని.. డ్రగ్స్, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఎంత త్వరగా వెళితే అంత మంచిది
రోహింగ్యాలు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే తమకు, మయన్మార్‌ కు అంత మంచిదని షేక్‌ హసీనా అన్నారు. రోహింగ్యాలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో  చర్చలు జరుపుతున్నామని చెప్పారు. భారత్‌ పొరుగు దేశమని.. ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. తీస్తా నది జలాల పంపకాల విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో కొందరు బంగ్లాదేశ్ విద్యార్థులను భారత్‌ స్వస్థలాలకు చేర్చిందని గుర్తు చేశారు.

సంక్షోభాలను ఎదుర్కోగలిగాం
శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశమే లేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంపై ప్రత్యేకంగా ఉన్నతస్థాయి బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభాలను ఎదుర్కోగలిగామని స్పష్టం చేశారు.

India
Bangladesh
Shaik Hasina
Bangladesh prime minister
International
Rohingyas
  • Loading...

More Telugu News