Night Sky Sanctuary: దేశంలోనే మొట్టమొదటి 'నైట్ స్కై శాంక్చువరీ' లడఖ్ లో ఏర్పాటు
- రాత్రివేళ ఆకాశంలో పరిశీలన, పరిశోధన కోసం శాంక్చువరీ
- హాన్లే గ్రామంలో ఏర్పాటు
- కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య చర్చలు
- ఐఐఏ సాయంతో శాంక్చువరీ ఏర్పాటు
రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, గ్రహాలను, ఉపగ్రహాలను పరిశీలించడం కొందరికి హాబీ. మరికొందరికి అదే వృత్తి. అలాంటి వారి కోసం లడఖ్ లో నైట్ స్కై శాంక్చువరీ ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నైట్ స్కై శాంక్చువరీ. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో నెలకొల్పబోయే టెలిస్పోపిక్ సైట్లలో ఇది కూడా ఒకటి.
లడఖ్ ప్రాంతంలోని హాన్లే గ్రామంలో ఈ శాంక్చువరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ శాంక్చువరీ వల్ల స్థానిక పర్యాటకం అభివృద్ధి చెందడమే కాకుండా, ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర సైన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ మధ్య ఢిల్లీలో చర్చలు జరిగాయి.
దీనిపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటుందని వెల్లడించారు. ఈ శాంక్చువరీ ద్వారా రాత్రివేళ ఆకాశాన్ని పరిశీలించేందుకు సహజసిద్ధమైన నిర్మలాకాశం ఎంతో ముఖ్యమని, కానీ వాతావరణ కాలుష్యం, ఇతర కృత్రిమకాంతులు అందుకు అడ్డంకిగా మారతాయని వివరించారు. ఐఐఏ సాయంతో ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
కాగా, నైట్ స్కై శాంక్చువరీ ఏర్పాటు చేస్తున్న హాన్లే గ్రామానికి సమీపంలో సరస్వతి పర్వతంపై ఇప్పటికే ఐఐఏకి ఓ అబ్జర్వేటరీ ఉంది.