Gold Coins: వంటగదిలో నిధి... తవ్విచూస్తే రూ.2.3 కోట్ల విలువైన బంగారు నాణేలు
- బ్రిటన్ లో ఘటన
- పాత ఇంట్లో పనులు చేపట్టిన జంట
- కిచెన్ లో తవ్వుతుండగా క్యాన్ లభ్యం
- క్యాన్ లో 264 బంగారు నాణేలు
- 400 ఏళ్ల నాటి నాణేలు.. త్వరలో వేలం
పూర్వకాలంలో రాజులు, జమీందారులు భద్రపరిచిన నిధినిక్షేపాలు ఇప్పటికీ అక్కడక్కడా బయల్పడుతుంటాయి. బ్రిటన్ లో ఓ జంటకు చెందిన ఇంటిలోనూ ఇలాంటి నిధే బయటపడింది. వంట గదిలో తవ్విచూస్తే ఏకంగా 264 బంగారు నాణేలు కనిపించాయి. వాటి విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ నాణేలు 400 ఏళ్ల నాటివని భావిస్తున్నారు. నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించారు.
కాగా, ఆ దంపతులు తమ పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇదే ఇంటిలో తాము గత పదేళ్లుగా ఉంటున్నామని తెలిపారు. ఎల్లెర్బీ గ్రామంలో ఈ జంటకు ఓ ఇల్లు ఉంది. ఇది చాలా పాత ఇల్లు కావడంతో వారు ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో కిచెన్ లో ఫ్లోర్ బోర్డు తొలగించగా, ఓ లోహపు క్యాన్ లో భద్రంగా ఉన్న బంగారు నాణేలు దర్శనమిచ్చాయి.
కిచెన్ లో తవ్వుతున్న సమయంలో గట్టిగా తగలడంతో ఏదైనా విద్యుత్ వైర్ల పైపు అయ్యుంటుందని ఆ దంపతులు భావించారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. దాంట్లో బంగారు నాణేలు ఉండడంతో ఆ జంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.
ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. అప్పట్లో ఎవరైనా వాణిజ్య ప్రముఖుడి కుటుంబానికి చెందినవి అయ్యుంటాయని స్థానిక మీడియా పేర్కొంది.