- ఫామ్ ను కోల్పోవడంతో రాహుల్ పై విమర్శలు
- ఇలా అయితే చోటు కష్టమేనన్న సునీల్ గవాస్కర్
- ఓపెనర్ స్థానానికి గిల్ రూపంలో గట్టి పోటీ ఉందన్న అభిప్రాయం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి, ఒక్క మ్యాచ్ లోనూ గొప్పగా రాణించలేని పరిస్థితుల్లో అతడు విమర్శకులకు లక్ష్యంగా మారాడు. కాకపోతే రెండేళ్ల విరామం తర్వాత ఆసియాకప్ లో కోహ్లీ తిరిగి రాణిస్తుండడం కాస్తంత ఊరట. కానీ, అదే సమయంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పైకి విమర్శలు మళ్లాయి. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ఈ ఏడాది ఇంత వరకు టీ20 మ్యాచ్ లు ఆడలేదు. ఐపీఎల్ ను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
రాహుల్ ఇటీవలే జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సీరిస్ లోనూ అతడు రాణించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్ లోనూ అతడి ఆటలో మార్పులేదు. దీంతో వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ‘‘శుభ్ మన్ గిల్ జింబాబ్వేలో, వెస్ట్ ఇండీస్ లో గొప్పగా ఆడాడు. దీంతో ఓపెనర్ గా గట్టి పోటీ నెలకొంది. కనుక నీవు (రాహుల్) పరుగులు సాధించలేకపోతే, ఫామ్ లో లేకపోతే అది ఆందోళనకరం. ప్రపంచకప్ కు ఇది ప్రాధాన్య అంశమే అవుతుంది. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లనే తీసుకోవాల్సి వస్తుంది’’ అని గవాస్కర్ పేర్కొన్నారు
ఎవరో ఒకరిని తీసుకునే అవకాశమే లేదని ఆయన అన్నారు. 'రెండు మూడు మ్యాచ్ ల తర్వాత ఫామ్ లోకి వస్తాడులే అన్న ఆశ సరికాదు. ఎందుకంటే ప్రపంచకప్ మ్యాచ్ లు కష్టంగా ఉంటాయి. రాహుల్ ముందు ఇంకా కొన్ని మ్యాచ్ లే ఉన్నాయి. వాటిల్లో అయినా అతడు మంచి స్కోరు చేయాలి. లేదంటే సెలక్షన్ కమిటీ తదుపరి ఎవరు ఉన్నారని చూస్తుంది’’ అని గవాస్కర్ హెచ్చరికతో కూడిన హితవు పలికాడు.