ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అన్ ఫిట్... ముప్పు తప్పదంటున్న రష్యా

Ros Cosmos chief Yuri Borisov says ISS may become dangerous with failed systems

  • వివరాలు తెలిపిన రాస్ కాస్మోస్ చీఫ్ యూరి బొరిసోవ్
  • ఐఎస్ఎస్ లోని భాగాలు పాడైపోయాయని వెల్లడి
  • సిబ్బంది ప్రాణాలకు భరోసా లేదని వ్యాఖ్యలు
  • చైనాతో కలిసి కొత్త స్పేస్ స్టేషన్ ను ప్రయోగిస్తున్న రష్యా

ఇప్పటికే అంతరిక్షంలో పరిభ్రమిస్తూ అనేక పరిశోధనలకు వేదికగా నిలుస్తూ, కీలక సమాచారాన్ని భూమికి చేరవేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఇక ఎంతమాత్రం పనికిరాదని, పైగా ప్రమాదకరంగా పరిణమిస్తుందని రష్యా అంటోంది. 

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ చీఫ్ యూరి బొరిసోవ్ స్పందిస్తూ, ఐఎస్ఎస్ లో అనేక వ్యవస్థలు పాడైపోయాయని, కొన్ని భాగాలకు కాలం చెల్లిందని వివరించారు. ఎగిరే ప్రయోగశాలగా పేరుగాంచిన ఐఎస్ఎస్ లో ఉన్న సిబ్బంది ప్రాణాలకు కూడా భద్రత లేని పరిస్థితి నెలకొందని అన్నారు. త్వరలోనే రష్యా తన మిత్ర దేశం చైనాతో కలిసి సొంత స్పేస్ స్టేషన్ ను రోదసిలోకి పంపనున్న నేపథ్యంలో, యూరి బొరిసోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో... రష్యా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, అంతరిక్ష పరిశోధన రంగంలో మాత్రం పరస్పర సహకారం కొనసాగుతోంది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నిర్వహణలో ఇరుదేశాలు పాలుపంచుకుంటున్నాయి. ఇప్పుడు తాను చైనాతో కలిసి కొత్త స్పేస్ స్టేషన్ ను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న ఐఎస్ఎస్ ను వదిలించుకోవాలని రష్యా భావిస్తున్నట్టు యూరి బొరిసోవ్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. 

సాంకేతికంగా ఐఎస్ఎస్ ఇప్పటికే అన్ని భద్రతా గడువులను దాటిపోయిందని, ఇది ఎంతో ప్రమాదకరమని బొరిసోవ్ పేర్కొన్నారు. ఓ మంచుతుపాను విరుచుకుపడినట్టు, ఐఎస్ఎస్ లోని వ్యవస్థలన్నీ ఒక్కసారిగా మొరాయించే ముప్పు ఉందని అన్నారు. 

ఇక, తాము రోదసిలో ప్రయోగించే కొత్త స్పేస్ స్టేషన్ ధృవాలను కలుపుతూ భూమిని చుట్టివస్తుందని తెలిపారు. రష్యాకు చెందిన విశాల భూభాగాన్ని పర్యవేక్షించడమే కాకుండా, అంతరిక్ష రేడియో ధార్మికతకు సంబంధించి నూతన సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించారు.

More Telugu News