Sri Potti Sriramulu Nellore District: నెల్లూరు జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. హోటల్ సప్లయరే హంతకుడు!

Nellore double murder case solved

  • ఈ నెల 27న అర్ధరాత్రి కృష్ణారావు దంపతుల హత్య
  • సప్లయర్ శివను పలుమార్లు తిట్టడంతో కృష్ణారావుపై కక్ష పెంచుకున్న నిందితుడు
  • శివకు సాయం చేసిన కృష్ణారావు బంధువు రామకృష్ణ
  • హత్యల తర్వాత రూ. 1.60 లక్షలు దోచుకున్న వైనం

నెల్లూరు జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కృష్ణారావు (54)-సునీత (50) దంపతులను హత్య చేసింది హోటల్ సప్లయర్ శివేనని తేల్చారు. శివకు కృష్ణారావు బంధువు రామకృష్ణ సాయం చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణారావు హోటల్‌లో శివ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శివను కృష్ణారావు పలుమార్లు హోటల్‌లోనే తిట్టారు. దీంతో కోపం పెంచుకున్న శివ పగ తీర్చుకోవడంతోపాటు డబ్బు కోసం కృష్ణారావు, ఆయన భార్య సునీతను హత్య చేశాడు. 

శివ, రామకృష్ణ కలిసి తొలుత కృష్ణారావు గొంతు కోశారు. ఆ తర్వాత నిద్రిస్తున్న సునీత తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆపై ఇంట్లోని రూ. 1.60 లక్షలు ఎత్తుకెళ్లారు. డబ్బుపై ఆశతోనే శివకు రామకృష్ణ సహకరించినట్టు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వారి అంత్యక్రియల్లోనూ నిందితులిద్దరూ పాల్గొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

నెల్లూరులోని కరెంటు ఆఫీసు సెంటర్‌లో కృష్ణారావు హోటల్ నిర్వహించేవారు. ఈ నెల 27న అర్ధరాత్రి సమయంలో కృష్ణారావు దంపతులు హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం పాలుపోసేందుకు వచ్చిన రమణమ్మ.. కృష్ణారావు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణారావు, సునీత దంపతుల కుమారులు సాయిచంద్, గోపీచంద్‌లు వివాహాలు జరిగిన తర్వాత వేర్వేరుగా ఉంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సప్లయర్ శివ, కృష్ణారావు బంధువు రామకృష్ణ నిందితులని తేల్చారు. వారిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు 15 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని ఎస్పీ తెలిపారు.

Sri Potti Sriramulu Nellore District
Double Murders
Crime News
  • Loading...

More Telugu News