Ayushman: బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రా కేసులో మరో ట్విస్ట్.. ఆమె అరాచకాలను బయటపెట్టింది కుమారుడే!
- పని మనిషి నాలుకతో టాయిలెట్‌ను క్లీన్ చేయించినట్టు సీమా పాత్రాపై ఆరోపణలు
- ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు
- వచ్చే నెల 12 వరకు రిమాండ్ విధించిన కోర్టు
- తల్లి అరాచకాలను చూడలేక కుమారుడే బయటపెట్టినట్టు జాతీయ మీడియాలో వార్తలు
ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ బహిష్కృత మహిళా నేత, మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్రా భార్య సీమా పాత్రా కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పనిమనిషిపై తల్లి పాల్పడిన అకృత్యాలను స్వయంగా ఆమె కుమారుడే బయటపెట్టినట్టు తెలుస్తోంది. తన ఇంట్లోని పనిమనిషి సునీత నాలికతో టాయిలెట్‌ను శుభ్రం చేయించినట్టు సీమా పాత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో సునీత మాట్లాడుతూ.. సీమా తన నాలుకతో టాయిలెట్‌ను శుభ్రం చేయించారని, తనను బంధించి చిత్ర హింసలకు గురిచేశారని, వేడివేడి వస్తువులతో శరీరంపై కాల్చేవారని పేర్కొంది. సీమాపాత్రాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సీమను ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
సునీత విషయం వెలుగులోకి రావడానికి సీమా పాత్రా కుమారుడు ఆయుష్మాన్ కారణమన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సునీతను తన తల్లి చిత్రహింసలకు గురిచేయడాన్ని చూసి భరించలేకపోయిన ఆయుష్మాన్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన ఓ ప్రభుత్వాధికారికి చెప్పి సునీతకు సాయం చేయాలని కోరారట. దీంతో స్పందించిన ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీమ ఇంటికి వెళ్లి సునీతను రక్షించి ఆసుపత్రికి తరలించారు. తాను బతికి ఉండడానికి ఆయుష్మానే కారణమని చెబుతూ సునీత కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయుష్మాన్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నారు. కాగా, ఈ తెల్లవారుజామున సీమా పాత్రాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 12 వరకు కోర్టు ఆమెను పోలీసు కస్టడీకి అప్పగించింది.