Union Gevernment: స్థానిక సంస్థలకు కేంద్రం నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు
- అన్ని రాష్ట్రాలకు రూ.15,705 కోట్లను విడుదల చేసిన కేంద్రం
- గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద నిధుల విడుదల
- అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.3,733 కోట్లు విడుదల
వినాయక చవితి నాడు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు మొత్తంగా రూ.15,705.65 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీకి రూ.948.35 కోట్లు విడుదల కాగా... తెలంగాణకు మాత్రం రూ.273 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇక ఈ నిధుల్లో అత్యధికంగా దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు రూ.3,733 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. అదే సమయంలో బీహార్‌కు రూ.1,921 కోట్లు విడుదలయ్యాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లకు పైగానే నిధులు విడుదల కాగా...మిగిలిన వాటికి మాత్రం వెయ్యి కోట్లకు లోపలే నిధులు విడుదలయ్యాయి.