Andhra Pradesh: సీఎం ఇంటి ముట్టడిని విరమించినా అరెస్టులు అన్యాయం: ఏపీఎన్జీఓ
- సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల ఉద్యమం
- సీఎం ఇంటి ముట్టడిని విరమించినట్లు ప్రకటించిన ఏపీఎన్జీఓ
- అయినా ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టారన్న సంఘం నేతలు
- నిరసనగా రేపు విద్రోహ దినంగా పాటించనున్నట్లు ప్రకటన
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోరుతూ ఉద్యమ బాట పట్టిన ఏపీ ఉద్యోగులు... తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1న చలో విజయవాడతో పాటు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంత్రుల బృందం విజ్ఞప్తి మేరకు రేపు (సెప్టెంబర్ 1)న నిర్వహించతలపెట్టిన సీఎం ఇంటి ముట్టడిని విరమించుకున్నట్లు ఏపీ ఎన్జీఓ ప్రకటించింది. అయినా కూడా ఉద్యోగులపై ఏపీ పోలీసులు ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టినట్లుగా ఏపీఎన్జీవో నేతలు బుధవారం ఆరోపించారు.
ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ ఉద్యోగ సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి ముట్టడిని విరమించినా కూడా ఉద్యోగులపై వేధింపులు, బెదిరింపులు, బైండోవర్లకు గురి చేయడం అన్యాయమని వారు ధ్వజమెత్తారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు విద్రోహ దినంగా పాటించనున్నట్లు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేసేదాకా తమ పోరాటం ఆగదన్న ఉద్యోగులు... సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.