Chandrababu: కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: చంద్రబాబు
- కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలు వివాదాస్పదం
- ఎన్నికలు రద్దు చేసిన వైనం
- త్రిసభ్య కమిటీ ఏర్పాటు
- తాజాగా హైకోర్టులో విచారణ
- స్పందించిన చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కడం తెలిసిందే. టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడాన్ని భరించలేక వైసీపీ నేతలు ఎన్నికలు రద్దు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలు రద్దు చేసి, పాలకవర్గానికి బదులు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, టీడీపీ నేత చంద్రబాబునాయుడు స్పందించారు.
ఎన్నికలు రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని విమర్శించారు. కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కు చెంపపెట్టు వంటిదని అన్నారు. బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ తెచ్చిందని, త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని చంద్రబాబు వివరించారు.
అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. న్యాయంగా జరిగిన ఎన్నికలను ఒప్పుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు. న్యాయవ్యవస్థ ఒకటుందని జగన్ గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు.