Asia Cip: భారత్, పాక్ మ్యాచ్‌ను గ్రూపులుగా వీక్షిస్తే డిబార్ చేస్తాం... శ్రీనగర్ నిట్ విద్యార్థులకు హెచ్చరికలు
![srinagat nit officials guideline to their students on india and pak cricket match](https://imgd.ap7am.com/thumbnail/cr-20220828tn630b17e0eb34c.jpg)
- భారత్, పాక్ మ్యాచ్‌పై శ్రీనగర్ నిట్ విద్యార్థులకు అధికారుల సూచనలు
- విద్యార్థులంతా తమ గదుల్లోనే ఉండాలని ఆదేశాలు
- ఇతరుల గదుల్లోకి వెళ్లరాదని ఆంక్షలు
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని సూచన
సుదీర్ఘ కాలం తర్వాత భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి ఇరు దేశాల జట్ల మధ్య దుబాయి వేదికగా జరగనున్న మ్యాచ్‌ను ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ దేశాల అభిమానులు కూడా వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ వీక్షణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విద్యార్థులకు ఆ విద్యా సంస్థ అధికారుల నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్, పాక్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్‌ను బృందాలుగా (గ్రూపులుగా) వీక్షించరాదని అధికారులు విద్యార్థులను ఆదేశించారు. మ్యాచ్ సందర్భంగా విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని.. ఇతరుల గదుల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ తమ ఆదేశాలను ధిక్కరించి గ్రూపులుగా మ్యాచ్‌ను వీక్షిస్తే హాస్టల్ నుంచి డిబార్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా తమ తమ గదుల్లో మ్యాచ్‌ను వీక్షించడం వరకు ఓకే గానీ... మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు కూడా పెట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.