Congress: రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి
![congress leader complaint against revanth reddy in banjara hills police station](https://imgd.ap7am.com/thumbnail/cr-20220827tn6309f7efc21d1.jpg)
- గ్యాంగ్ రేప్‌పై గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- రేవంత్ వ్యాఖ్యలు తప్పు అన్న విష్ణువర్ధన్ రెడ్డి
- పెద్దమ్మ గుడి ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని వెల్లడి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ పబ్ వద్ద మైనర్ బాలికను అపహరించి సామూహిక అత్యాచారం చేసిన యువకుల ఘటనపై గతంలో స్పందించిన రేవంత్ రెడ్డి... అత్యాచార ఘటన జూబ్లిహిల్స్ పరిధిలోని పెద్దమ్మ గుడి ఆవరణలో జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి శనివారం నేరుగా బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దమ్మ గుడి ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దేవాలయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదని కూడా ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పు అని ఆయన అన్నారు. తనకు ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆలయ పరిధిలో అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రకటనలు చేసినందుననే రేవంత్ రెడ్డిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.