Cooking Oil: కాచిన నూనెనే మళ్లీ కాస్తున్నారా..? మహా ముప్పు కొని తెచ్చుకోవద్దు!

Reheating Cooking Oil Health Risks Involved More than half of cooking oil gets reused in India

  • దేశంలో 60 శాతం వంటనూనె మళ్లీమళ్లీ కాస్తున్నదే
  • అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి
  • మళ్లీ మళ్లీ కాచడం వల్ల హానికారక రసాయనాల విడుదల
  • గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్ ముప్పు

వంట నూనె ప్రధాన ఆహారాల్లో ఒకటి. ఇది లేనిదే ముద్ద దిగదు. ఆకలి తీరదు. కానీ, తెలియనితనంతో వంట నూనెను ఒకసారి కాచిన దాన్ని మళ్లీ తిరిగి వినియోగించడం దేశంలో పెరిగిపోయింది. దేశంలో 60 శాతం వంట నూనె మళ్లీ, మళ్లీ వినియోగిస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. కానీ, ఇది ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తుందన్నది ఎవరికీ అవగాహన ఉండడం లేదు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఈ విధానంతో కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ సర్వేను అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, కోన్ అడ్వైజరీ గ్రూపు, తదితర సంస్థలు కలసి నిర్వహించాయి. దేశంలో ఈ తరహా సర్వే నిర్వహించడం ఇదే మొదటిసారి. మనదేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లోని టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ వాహనాలపై కాచిన నూనెను ఎప్పటికప్పుడు మార్చకపోవడాన్ని చూడొచ్చు. అధిక ఉష్ణోగ్రత వద్ద వంట నూనె కాగుతూ ఉంటుంది. కొంత పరిమాణం తగ్గిన వెంటనే మళ్లీ కొంత నూనె దానికి కలుపుతుంటారు. ఈ విధమైన వినియోగాన్ని మార్చేందుకు, వినియోగదారుల్లో అవగాహనకు ప్రభుత్వం, ఆహార భద్రతా విభాగాలు, వైద్యులు, పోషకాహార నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలసి పనిచేయాలని ఈ సర్వే సూచించింది.

ఏమవుతుంది..?
ఒక్కసారి కాచగా, మిగిలిన నూనెను తిరిగి మళ్లీ మంటపై కాచినప్పుడు హానికారక ఆల్డెహైడ్స్ రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి కేన్సర్ కారకాలు. గుండె జబ్బులు, డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్ సన్స్ తదితర వ్యాధులకు ఇవి కారణమవుతాయి. అత్యంత విషపూరిత 4-హైడ్రాక్సీ ట్రాన్స్ 2 నామినల్ విడుదల అవుతుంది. ఇది డీఎన్ఏ, ఆర్ఎన్ఏపై ప్రభావం చూపిస్తుంది. 

కాచిన నూనె అధిక ఉష్ణోగ్రత వద్ద మళ్లీ మళ్లీ మరగడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక పరిమాణంలో విడుదల అవుతాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎల్డీఎల్ పెరిగి దీర్ఘకాలం పాటు అలాగే కొనసాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ బారిన పడే ముప్పు తలెత్తుతుంది. జీర్ణాశయ సమస్యలు వస్తాయి. కాచిన నూనె గాలి, వెలుతురుకు గురైనప్పుడు అసంపూర్ణ లేదా సంపూర్ణ ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని రాన్సిడిటీ అంటారు. దీనివల్ల అసిడిటీ, కడుపులో మంట, గొంతు సమస్యలు వస్తాయి. 

కాచిన నూనెను వాడడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (రక్తనాళ్లాలో వాపు) ఏర్పడుతుంది. దీనివల్ల కేన్సర్ ముప్పు తలెత్తుతుంది. దీర్ఘకాలం పాటు ఇన్ ఫ్లమేషన్ అలాగే కొనసాగితే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అంతే కాదు, ఈ ఇన్ ఫ్లమేషన్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం బారినపడతారు. అవయవాలు దెబ్బతింటాయి. అందుకని నూనెను తక్కువ పరిమాణంలో మూకుడులో పోసుకుని వినియోగం తర్వాత దాన్ని పారబోయడమే మంచిది. మరోసారి ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు.

  • Loading...

More Telugu News