Andhra Pradesh: ఏపీకి ఎకనమిక్ టైమ్స్ అవార్డు... జగన్‌కు అందించి హర్షం వ్యక్తం చేసిన మంత్రి రజని
![ap gets the economic times award in digitalization of health cards](https://imgd.ap7am.com/thumbnail/cr-20220826tn6308bd9e68ba9.jpg)
- ఏపీ ప్రజల ఆరోగ్య వివరాల డిజిటలైజేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం
- అందుకు గాను ఏపీకి అవార్డు అందించిన 'ద ఎకనమిక్ టైమ్స్'
- ఆరోగ్య మంత్రి హోదాలో అవార్డు అందుకున్న రజని
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓబీడీ)లో గత కొన్నేళ్లుగా ఏపీ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక... రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ అయిపోతున్నాయి. తొలుత పాఠశాల విద్యార్థుల నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాల డిజిటలైజేషన్ దిశగా సాగుతోంది. ఈ రంగంలో విశేష ప్రతిభ కనబరచినందుకు ఏపీకి తాజాగా ఓ అవార్డు దక్కింది.
ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయడంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న ఏపీకి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద ఎకనమిక్ టైమ్స్ ఓ అవార్డును అందజేసింది. ఏపీ ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్న విడదల రజని ఈ అవార్డును స్వీకరించారు. శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్‌ను కలిసిన రజని... తాను అందుకున్న అవార్డును జగన్‌కు అందజేశారు. ఈ అవార్డు రాష్ట్రానికి దక్కిన కారణం, ఆ దిశగా తన ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ చేస్తున్న కృషిని జగన్‌కు రజని వివరించారు.