CM Jagan: ఏపీలో ఈరోజు నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాం: సీఎం జగన్

AP CM Jagan announces ban on plastic flexes

  • సీఎం జగన్ విశాఖ పర్యటన
  • ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీ
  • 2027 నాటికి లక్ష్యం అందుకోవడంపై దృష్టి
  • పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం
  • కాస్త ఖర్చయినా వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలు వాడాలన్న సీఎం

ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ సమక్షంలో అమెరికాకు చెందిన పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా మలిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలకే అనుమతి ఉంటుందని వెల్లడించారు. 

"కాసేపటి కిందట నేను కార్లో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనిపించాయి. అన్నింట్లోనూ నేనే ఉన్నాననుకోండీ... అది వేరే విషయం! దాంతో కలెక్టర్ ను అడిగాను... ఇవాళ్టి మన కార్యక్రమమే ప్లాస్టిక్ వినియోగం అంశంపైన కదా... నా ఫొటోలతో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీలే కనిపిస్తుంటే తప్పుడు సందేశం వెళుతుంది కదా? అని అన్నాను. దాంతో ఆయన అవి వస్త్రంతో తయారుచేసిన ఫ్లెక్సీలు సర్ అని వివరణ ఇచ్చాడు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ అయితే రూ.8, వస్త్రంతో చేసిన ఫ్లెక్సీ అయితే రూ.32 పడుతుంది సర్ అని చెప్పాడు. కొంచెం అధిక ఖర్చు అయినప్పటికీ వస్త్రంతో తయారుచేసిన ఫ్లెక్సీలే ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించాడు. 

ఈ క్రమంలో నేటి నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కాస్త ఖర్చు ఎక్కువైనా సరే వస్త్రంతో తయారుచేసిన ఫ్లెక్సీలనే ఏర్పాటు చేయండి. ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నాం" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

CM Jagan
Plastic Flex
Ban
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News