Sonali Phogat: సోనాలీ ఫోగాట్ హత్య కేసు.. ఆమె ఇద్దరు సహాయకుల అరెస్ట్
- పోస్టుమార్టంలో సోనాలిది హత్యగా నిర్ధారణ
- ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు వెల్లడి
- హత్య కేసు నమోదు చేసిన పోలీసులు
- సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ వాసిలను అరెస్ట్ చేసిన పోలీసులు
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగాట్ (43)ది సహజ మరణం కాదని పోస్టుమార్టంలో తేలడంతో హత్య కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు తాజాగా ఆమె ఇద్దరు సహాయకులను అరెస్ట్ చేశారు. సోనాలీ శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్టు అటాప్సీలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఇద్దరు సహాయకులు సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ వాసిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫొగట్ సోదరుడు రింకు ఢాకా బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు. తన సోదరిని వీరే హత్య చేసి ఉంటారని ఆరోపించారు.
ఈ నెల 22న సోనాలి గోవాకు వచ్చినప్పుడు వీరిద్దరు ఆమెతోనే ఉన్నారు. ఆ తర్వాతి రోజు ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నార్త్ గోవా జిల్లాలోని సెయింట్ ఆంథోనీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ఆమె మరణించి ఉండొచ్చని వైద్యులు తొలుత పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యుల సమ్మతితో పోస్టుమార్టం నిర్వహించగా శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెది గుండెపోటు కాదని, హత్య అని నిర్ధారణ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులైన ఆమె ఇద్దరి సహాయకులు సంగ్వాన్, వాసిలను అరెస్ట్ చేశారు.
టిక్ టాక్ వీడియోలతో పేరు తెచ్చుకున్న సోనాలీ 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2020లో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని గుర్తింపు పొందారు. ఆమెకు 15 ఏళ్ల యశోధర అనే కుమార్తె ఉంది. సోనాలీ భర్త 2016లో మరణించారు.