Jharkhand: బీజేపీకి అనుకూలంగా ఉండి ఉంటే సోరెన్ జోలికి పోయేవాళ్లా?: సీపీఐ నారాయణ
![cpi narayana comments on hemanth soren issue](https://imgd.ap7am.com/thumbnail/cr-20220825tn63073d5ed2246.jpg)
- సోరెన్ అనర్హతకు ఈసీ సిఫారసు
- ఘాటుగా స్పందించిన సీపీఐ నారాయణ
- వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని ఆరోపణ
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన అనుచరులపై సీబీఐ, ఈడీ దాడుల అనంతరం గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. సోరెన్‌పై అనర్హత వేటుకు సిఫారసు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు. సోరెన్ బీజేపీకి అనుకూలంగా ఉండి ఉంటే... ఆయనపై సీబీఐ, ఈడీ దాడులతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత సిఫారసులు ఉండేవా? అంటూ నారాయణ ప్రశ్నించారు.
దేశంలో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని నారాయణ ఆరోపించారు. అందులో భాగంగానే హేమంత్ సోరెన్‌పై వరుస దాడులు, తాజాగా ఎన్నికల సంఘం అనర్హత వేటుకు సిఫారసు తదితర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తమకు అనుకూలంగా లేని ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనుగడ సాగించకూడదన్న భావనతోనే బీజేపీ సర్కారు ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు.