Telangana: మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ.. నలుగురి పేర్లు పరిశీలిస్తున్న షర్మిల
- ప్రచారంలో దూసుకుపోవాలని షర్మిల నిర్ణయం
- వైఎస్సార్ పాలన ఓట్లు తెచ్చిపెడుతుందని నమ్మకం
- ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్ పాలనను గుర్తు చేసే దిశగా ప్రణాళిక
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో అనివార్యంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొత్త పార్టీ వైఎస్సార్టీపీ కూడా పోటీ చేయనుంది. ఈ మేరకు మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సూత్రప్రాయంగా నిర్ణయించారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆమె నలుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం.
తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన తన పార్టీకి తెలంగాణలో ఓట్లను తెచ్చిపెడుతుందన్న బలమైన నమ్మకంతో షర్మిల సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇతర పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేయాలని ఆమె నిర్ణయించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని సందర్శించనున్న ఆ పార్టీ నేతలు... వైఎస్సార్ పాలనను గుర్తు చేసే దిశగా ప్రణాళిక రూపొందించారు.