PM Modi: దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates India largest hospital in Haryana

  • హర్యానాలోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ప్రారంభం
  • గత ఆరేళ్లుగా నిర్మాణం
  • సహాయసహకారాలు అందించిన మాతా అమృతానందమయి మఠం
  • అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి

ఆధునికత, సాంకేతికతల మేళవింపుగా 2,600 పడకలతో దేశంలో అతిపెద్ద ఆసుపత్రిగా నిర్మాణం జరుపుకున్న అమృత హాస్పిటల్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు హర్యానాలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కూడా పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఆసుపత్రి గత ఆరేళ్లుగా నిర్మాణం జరుపుకుంది. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణానికి మాతా అమృతానందమయి మఠం చేయూతనిచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆసుపత్రిలో పూర్తి ఆటోమేటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం విశేషం. 

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో వైద్యరంగం, ఆధ్యాత్మికతల మధ్య ఎంతో సామీప్యత ఉందని తెలిపారు. అందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సరైన ఉదాహరణ అని, ప్రపంచంలోనే అతి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఆధ్యాత్మిక-ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగిన అవగాహన ప్రచారం సత్ఫలితాలను ఇచ్చిందని వివరించారు. 

కాగా, అమృత హాస్పిటల్ ను 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో పరిశోధనల కోసం ఏడు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. ఇందులో 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ విభాగం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు చేపట్టనుంది. ఇందులో మొత్తం 14 అంతస్తులున్నాయి. ఆసుపత్రి పైభాగంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు.
.

  • Loading...

More Telugu News