KTR: బీజేపీ కుట్రను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు తీరని నష్టం: కేటీఆర్
- పెట్రోల్ ధరలు, నిరుద్యోగం నుంచి దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్
- 'విద్వేషం కోసం, అధర్మం కోసం' అనేది బీజేపీ అసలైన రాజకీయ విధానమని విమర్శ
- ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని అందరూ గుర్తుంచుకోవాలని హితవు
దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మండిపోతున్న పెట్రోల్ ధరలు, ఊడిపోతున్న ఉద్యోగాలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోని నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
'దేశం కోసం, ధర్మం కోసం' అనేది బీజేపీ చెప్పుకునే అందమైన నినాదం మాత్రమేనని అన్నారు. విద్వేషం కోసం, అధర్మం కోసం అనేది బీజేపీ అసలైన రాజకీయ విధానమని విమర్శించారు. ప్రతి ఒక్కరి గుండెలో విద్వేషాలు నింపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఉద్వేగాల భారతం కాకుండా, ఉద్యోగాల భారతం ముఖ్యమని తెలుసుకోవాలని అన్నారు.