Telangana: బండి సంజయ్ పాదయాత్రకు భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించండి... గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి
![bjp team met ts governor and urges to security to bandi sanjay yatra](https://imgd.ap7am.com/thumbnail/cr-20220823tn6304f23972739.jpg)
- ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంజయ్
- మంగళవారం యాత్రలో ఉన్న బండి సంజయ్ అరెస్ట్
- గవర్నర్‌ను కలిసిన బీజేపీ బృందంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా సాగిన ఈ యాత్ర ప్రస్తుతం మూడో దశలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తముందన్న కోణంలో ఆరోపణలతో రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. మంగళవారం యాత్రలో ఉన్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటుగా యాత్రకు తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ఆ బృందం గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ను కలిసిన బీజేపీ బృందంలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు ఉన్నారు.