Mumbai: ముంబైలో ఐదు రోజుల గణేశ్ ఉత్సవాలకు రూ.316.4 కోట్ల బీమా
- ముంబైలోని కింగ్స్ సర్కిల్ గణేశ్ సేవా మండల్ నిర్ణయం
- ఐదు రోజుల పాటు వినాయకుడి నవరాత్రులు
- ఈ సందర్భంగా స్వామి వారికి భారీగా బంగారు ఆభరణాల అలంకరణ
ముంబైలోని కింగ్స్ సర్కిల్ లో ఉన్న జీఎస్ బీ సేవా మండల్ ఈ విడత వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు రూ.316.4 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. చివరిగా 2016లో జీఎస్ బీ రూ.300 కోట్ల బీమా తీసుకోవడం గమనార్హం. ఎందుకు అంత భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ ప్లాన్ ను తీసుకోవడం? అన్న సందేహం రావచ్చు.
ఇక్కడ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా స్వామికి 66 కిలోల బంగారు ఆభరణాలను అలంకరింప చేస్తారు. అలాగే, 295 కిలోల వెండి, ఇతర లోహాలతో చేసినవీ వినియోగిస్తారు.
ఇక ఈ ఏడాది తీసుకున్న భారీ బీమా గురించి జీఎస్ బీ సేవా మండల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘రూ.31.97 కోట్ల బీమా బంగారం, వెండి ఆభరణాలకు కవరేజీ కోసం తీసుకున్నది. ఇక 263 కోట్ల బీమా అన్నది సేవా మండల్ వలంటీర్లు, పూజారులు, వంటవారు, పాదరక్షల నిర్వాహకులు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రమాద బీమా కోసం’’ అని వివరించారు.
ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు ఈ నెల 29న కింగ్స్ సర్కిల్ లో ఉన్న జీఎస్ బీ గణేశ్ ఉత్సవ మండల్ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక ముంబైలోని వడాలాలో ఉన్న రామ్ మందిర్ వద్ద.. జీఎస్ బీ సర్వజనిక్ మండల్ రూ.250 కోట్ల బీమా తీసుకుంది. ఈ పాలసీకి తాము రూ.7-8 లక్షల ప్రీమియం చెల్లించనున్నట్టు ట్రస్టీ ఉల్హాస్ కామత్ తెలిపారు.