: అక్రమార్కుల టెర్రర్.. సీబీఐ జేడీ బదిలీ
తన పనితీరుతో అక్రమార్కులకు, అవినీతిపరులకు చుక్కలు చూపించిన సీబీఐ జాయింట్ డెరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ ఐదేళ్లపాటు సీబీఐలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. 2006 జూన్ 12న రాష్ట్రానికి వచ్చారు. ఆయన సర్వీసు 2011లో ముగిసింది. కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తుండడంతో ఏడాది చొప్పున రెండుసార్లు సర్వీసును పొడిగించారు. ఈసారి మాత్రం ఆయనను తిరిగి మహారాష్ట్రకు బదిలీ చేశారు. ముంబై నగర క్రైమ్ బ్రాంచ్ చీఫ్ గా నియమించినట్లు సమాచారం.
సత్యం కుంభకోణం, ఓబుళాపురం గనులు, ఎమ్మార్ స్కామ్, జగన్ అక్రమాస్తులు ఇలా కీలకమైన కేసుల దర్యాప్తును చేపట్టి వాటిని ఓ దిశకు తీసుకొచ్చారు. వైఎస్ జగన్మోహనరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ తదితర కీలక ప్రముఖులను జైలుకు పంపారు. ఆయన బదిలీ ప్రభావం జగన్ అక్రమాస్తుల కేసుపై ఉండదని అంటున్నారు. ఎందుకంటే, ఇందులో దాదాపుగా దర్యాప్తు పూర్తయిందని, తుది చార్జ్ష్ షీటు మాత్రమే దాఖలు చేయాల్సి ఉందని అంటున్నారు. లక్ష్మీనారాయణ నిజాయతీని మెచ్చుకుంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటవడం విశేషం.