Prime Minister: ఎస్ అంటే అది నా గెలుపు... నో అంటే 2024లో ఆయ‌న‌ ఓట‌మి: మోదీపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ట్వీట్

bjp mp subramanian swamy satires on modi over supreme court orders on rama setu

  • రామ‌సేతుపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌
  • ఆ క‌ట్ట‌డం పురాత‌న వార‌స‌త్వ కట్ట‌డ‌మో, కాదో చెప్పాల‌న్న కోర్టు
  • అఫిడ‌విట్ దాఖ‌లుకు కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ
  • కోర్టు ఆదేశాల‌ను ఆధారం చేసుకుని మోదీపై స్వామి సెటైర్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఇట‌వ‌లి కాలంలో నేరుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీనే టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా సోమ‌వారం రామ‌సేతు అంశాన్ని ఆధారం చేసుకుని ఆయన మ‌రోమారు మోదీపై సెటైర్ సంధించారు.

రామ‌సేతు వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై సోమ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా రామ‌సేతు నిర్మాణం పురాత‌న వార‌స‌త్వ క‌ట్ట‌డ‌మో? కాదో? తేల్చి చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అవునంటే అవున‌నండి, కాదంటే కాద‌ని చెప్పండి... ఏదో ఒక మాట అయితే మాత్రం క‌చ్చితంగా చెప్పాల్సిందేనంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తూ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోరింది.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి... ఈ వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు విచార‌ణ తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టేనని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఇప్పుడు రామ‌సేతుపై కేంద్రం నోరు విప్ప‌క త‌ప్ప‌ని పరిస్థితి నెల‌కొంద‌ని అన్నారు. రామ‌సేతు పురాత‌న వార‌స‌త్వ క‌ట్ట‌డ‌మే అని ఒప్పుకుంటే ఎస్ అని కేంద్రం చెబితే... తాను విజ‌యం సాధించిన‌ట్టేన‌ని స్వామి తెలిపారు. అలా కాకుండా రామసేతు పురాత‌న వార‌స‌త్వ క‌ట్టడం కాద‌ని కేంద్రం చెబితే... అది 2024లో మోదీ ఓట‌మికి దారి తీస్తుందంటూ జోస్యం చెప్పారు.

More Telugu News