Andhra Pradesh: ఏపీలో టెన్త్ పబ్లిక్ పరీక్షా విధానంలో మార్పులు.. ఇకపై 6 పేపర్లతోనే పరీక్ష
![ap government decides to decrease ssc exam papers from 11 to 6](https://imgd.ap7am.com/thumbnail/cr-20220822tn630370712305c.jpg)
- ప్రస్తుతం 11 పేపర్లతో కూడిన పరీక్షా విధానం
- కొత్తగా టెన్త్ పేపర్ల సంఖ్యను 6కు కుదిస్తూ సర్కారు నిర్ణయం
- వచ్చే ఏడాది నుంచే నూతన పరీక్షా విధానం దిశగా ప్రభుత్వం
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల స్వరూపం మారిపోనుంది. ఇప్పటిదాకా 11 పేపర్లతో కూడిన పబ్లిక్ పరీక్ష జరగగా... వచ్చే ఏడాది నుంచి 6 పేపర్లతో కూడిన పరీక్షను విద్యార్థులు రాయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చే దిశగా ఇదివరకే జగన్ సర్కారు నిర్ణయం తీసుకోగా... దానికి అనుగుణంగా ఇప్పుడు తుది నిర్ణయం వెలువడింది.
జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్న పరీక్షా విధానం మాదిరిగా రాష్ట్ర సిబలస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం 6 పేపర్ల పరీక్షా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ఈ నూతన పరీక్షా విధానం వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం.