Vizag: విశాఖలో నారా లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు... నిరసనగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ అగ్ర నేత
- పలాస పర్యటనకు బయలుదేరిన లోకేశ్
- అమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద లోకేశ్ అడ్డగింత
- పోలీస్ వ్యాన్‌లో లోకేశ్‌ను విశాఖ తరలించిన పోలీసులు
- విశాఖలో లోకేశ్ మీడియా సమావేశానికి అనుమతించని పోలీసులు
ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌కు పోలీసుల నుంచి ఊహించని రీతిలో అడ్డగింతలు ఎదురయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన లోకేశ్‌ను అమదాలవలస కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డగించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలాస పర్యటనకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు... లోకేశ్‌ను వెనక్కెళ్లాలంటూ ఆదేశించారు. అయితే సరైన కారణం లేకుండా తన పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరుపై లోకేశ్ మండిపడ్డారు. లోకేశ్ వాదనలను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు ఆయనతో పాటు పలువురు టీడీపీ సీనియర్లను అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. ఈ సందర్భంగా లోకేశ్ సహా టీడీపీ సీనియర్లను పోలీసులు పోలీస్ వ్యాన్‌లో ఎక్కించడం గమనార్హం.
విశాఖలోని మధురవాడ జంక్షన్ వద్ద లోకేశ్‌ను వదిలేసిన పోలీసులు... ఆ తర్వాత లోకేశ్ నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా అడ్డుకున్నారు. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ అయినందున మీడియా సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు... మీడియా సమావేశం నిర్వహించడం కుదరదని తేల్చేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా నారా లోకేశ్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వాదనలను ఎంతగా వినిపించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనతో పలాసలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యే లేదని ఆయన తెలిపారు. అయినా పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే... జగన్ సర్కారు తన పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని లోకేశ్ ఆరోపించారు.