Income tax department: పెళ్లి మండపాలు, ఆసుపత్రుల్లో నగదు చెల్లిస్తున్నారా..?: ఆదాయపన్ను శాఖ నిఘా
- ఎంత మొత్తమైనా నగదు రూపంలోనే లావాదేవీలు
- పన్నులు ఎగ్గొడుతున్నట్టు ఆదాయపన్ను శాఖ సందేహం
- నిబంధన అమలు దిశగా చర్యలు
నగదు లావాదేవీలు ఇప్పటికీ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. పన్నుల ఎగవేతపై ఆదాయపన్ను శాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా పెళ్లి మండపాలు (ఫంక్షన్ హాల్స్, బాంక్వెట్ హాల్స్ తదితర), ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరుగుతూ, పన్నుల ఎగవేత నడుస్తున్నట్టు ఆధాయపన్ను శాఖ అనుమానిస్తోంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది.
ఆసుపత్రులు రోగుల నుంచి నగదు స్వీకరించేట్టు అయితే, వారి పాన్ నంబర్ విధిగా తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిబంధనలు చెబుతున్నాయి. కానీ, వాస్తవంలో అధిక శాతం ఇది అమలు కావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం వచ్చే వారి నుంచి పాన్ తీసుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడదని ఆసుపత్రుల వాదనగా ఉంది. అయినా సరే పాన్ తీసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ భావిస్తోంది.
ఇక బాంక్వెట్ హాళ్లు సైతం వేడుకల కోసం అద్దెకిస్తూ, చార్జీ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుంటున్నట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. పైగా అవి రికార్డుల్లోనూ చూపించడం లేదు. ఇదంతా పన్నులు ఎగ్గొడుతున్న ఆదాయంగా ఆదాయపన్ను శాఖ భావిస్తోంది. దీంతో చర్యలకు నడుం బిగించింది.
నిబంధల ప్రకారం రూ.20,000, అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని రుణం లేదా డిపాజిట్ రూపంలో తీసుకోకూడదు. బ్యాంకుల ద్వారానే ఈ లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.2 లక్షలకు మించి నగదు తీసుకోవడానికి కూడా నిబంధనలు అంగీకరించవు.