Mahakali: జొమాటో వివాదాస్పద ప్రకటన ఆపేయాలి: ఉజ్జయిని పూజారుల డిమాండ్
- మహాకాళి ఆలయం నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నట్టుగా ప్రకటన
- ప్రకటనలో హృతిక్ రోషన్
- దీనిపై ఉజ్జయిని కలెక్టర్ కు అర్చకుల ఫిర్యాదు
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ నటించిన ప్రకటన హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఉజ్జయిని మహాకాళి దేవస్థానం అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనను జొమాటో వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉజ్జయినిలో ఆహార పళ్లెం ఉందని.. అందుకే మహాకాళి నుంచి ఆర్డర్ చేశానంటూ ప్రకటనలో హృతిక్ రోషన్ చెబుతుంటాడు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. జొమాటో వెంటనే తన ప్రకటనను ఉపసంహరించుకుని, క్షమాపణలు కోరాలని ఆలయ పూజారులు మహేశ్, ఆశిష్ డిమాండ్ చేశారు. ‘‘ఇక్కడ భక్తులకు ప్రసాదాన్ని పళ్లాలలో అందిస్తారు. ఈ ప్రకటన హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉంది’’అని వారు పేర్కొన్నారు.
మహాకాళి ఆలయం చైర్మన్ గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ ను అర్చకులు సంప్రదించారు. జొమాటోకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే మరోసారి హిందువులను ఎవరూ వెక్కిరించరని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ స్పందిస్తూ.. జొమాటో ప్రకటన తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. ఆలయం ఉచిత ఆహారాన్ని ప్రసాదంగా అందిస్తోందని, దీన్ని విక్రయించడం లేదని చెప్పారు.