Andhra Pradesh: ఏపీలో మున్నూరు కాపులు ఇకపై బీసీలే... బీసీ-డీ సర్టిఫికెట్ల జారీకి జగన్ ఆదేశం
- పోలవరం విలీన మండలాల్లో మున్నూరు కాపులు
- ఇటీవలే సీఎం జగన్ను కలిసిన కుల సంఘం నేతలు
- వారి విజ్ఞప్తి మేరకు బీసీ-డీలో మున్నూరు కాపులను చేర్చుతూ ఏపీ సర్కారు నిర్ణయం
ఇన్నాళ్లూ కాపులుగా పరిగణిస్తున్న మున్నూరు కాపులను ఏపీ ప్రభుత్వం బీసీలుగా గుర్తించింది. ఈ మేరకు శనివారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని మున్నూరు కాపులను బీసీ-డీ జాబితాలో చేర్చిన ఏపీ ప్రభుత్వం... ఆ మేరకు ఇకపై మున్నూరు కాపులకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనుంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో మున్నూరు కాపుల సంఖ్య బాగా తక్కువే. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలుగా గుర్తించి... రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా ఉంది. ఇటీవలే సీఎం జగన్ను కలిసిన మున్నూరు కాపులు తమను బీసీలుగా గుర్తించాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జగన్ ఆదేశాలు ఇవ్వగా... రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.