Airplane: 37 వేల అడుగుల ఎత్తున విమానం.. నిద్ర పోయిన పైలట్లు!
- సూడాన్ నుంచి ఇథియోపియా వెళ్తున్న విమానంలో ఘటన
- ఆటో పైలట్ మోడ్ లో 37 వేల అడుగుల ఎత్తులో తిరిగిన విమానం
- ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయం దాటి ముందుకు వెళ్లిన వైనం
- కాసేపటికి తేరుకుని ల్యాండ్ చేసిన పైలట్లు
అది బోయింగ్ 737 ఈటీ 343 విమానం. వందల మంది ప్రయాణికులతో.. సూడాన్ లోని ఖార్టోమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాకు వెళుతోంది. ఆకాశంలో ఏకంగా 37 వేల అడుగుల (సుమారు 10 కిలోమీటర్ల) ఎత్తున ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు పైలట్లు నిద్రలోకి వెళ్లిపోయారు.
అయితే విమానం ఆటో పైలట్ మోడ్ లో ఉండటంతో.. వేగంగా అదే 37 వేల అడుగుల ఎత్తులోనే చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. కాసేపటికి అడ్డిస్ అబాబాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఈ విషయాన్ని గుర్తించి వెంటనే అలర్ట్ జారీ చేసింది. ఆ మార్గంలో వచ్చే విమానాలన్నీ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదే సమయంలో ఈటీ 343 విమాన పైలట్లను హెచ్చరిస్తూ వార్నింగ్ సిగ్నల్స్ పంపించింది. చాలా సార్లు ప్రయత్నించినా పైలట్లు మేల్కొనలేదు.
ఎయిర్ పోర్టు దాటి ముందుకెళ్లిపోయి..
పైలట్లు అలా నిద్రలో ఉండగానే విమానం తాను ల్యాండ్ కావాల్సిన ఎయిర్ పోర్టును దాటేసింది. ఈ సమయంలో ఆటో పైలట్ మోడ్ డిస్కనెక్ట్ అయిపోయి.. విమానంలో పెద్ద ఎత్తున అలారం మోగింది. దీనితో పైలట్లు నిద్ర నుంచి మేల్కొని విమానాన్ని నియంత్రించడం మొదలుపెట్టారు. సుమారు 25 నిమిషాల తర్వాత సురక్షితంగా అడ్డీస్ అబాబా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగిన ఈ ఘటన వైమానిక వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయ్యాక పైలట్లు వెంటనే మేల్కొనకపోతే విమానం కూలిపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ఇంతకుముందు మే నెలలో కూడా న్యూయార్క్ నుంచి ఇటలీలోని రోమ్ కు వెళుతున్న ఎయిర్ బస్ 330 విమానంలోని ఇద్దరు పైలట్లు కూడా ఇలాగే నిద్రపోయారు. ఆ సమయంలో విమానం ఏకంగా 38 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోంది.
- అయితే పైలట్లు ఇలా తీవ్రంగా అలసిపోయి నిద్రలోకి వెళ్లడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుందని వైమానిక రంగ నిపుణుడు అలెక్స్ మాచెరాస్ తెలిపారు. వాతావరణంలో అంత ఎత్తున పరిస్థితులు, పైలట్లకు తీవ్ర పని ఒత్తిడి వంటివి దీనికి కారణం అవుతాయని పేర్కొన్నారు.