Fake police station: బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలల తర్వాత గుర్తించిన అసలు పోలీసులు
- పోలీసు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన నిందితుడు
- ఆపై గెస్ట్ హౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
- నకిలీ యూనిఫామ్, నాటు తుపాకులు ఇచ్చిన వైనం
- డీఎస్సీ సహా మహిళా పోలీసుల నియామకం
మోసానికి మరో రూపం ఇది. నిందితులు ఎంతగా తెగించారో చెప్పేందుకు ఇది అతిపెద్ద ఉదాహరణ. బీహార్‌లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డీఎస్పీ సహా అందరినీ నియమించేశాడు. వారికి నాటు తుపాకులు ఇచ్చి రోడ్లపైకి పంపాడు. చెకింగుల పేరుతో వాహనదారులను భయపెట్టి వారు డబ్బులు గుంజుకునేవారు. ఈ నకిలీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అసలు పోలీస్ స్టేషన్ ఉన్నా గుర్తించలేకపోవడం గమనార్హం. అయితే, నకిలీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నాటు తుపాకి చూసిన అసలు పోలీసు ఆరా తీయడంతో 8 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాంకా జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పోలీసు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం గెస్ట్ హౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. తాను డబ్బులు వసూలు చేసిన వారికి నకిలీ యూనిఫామ్‌లు ఇచ్చి పోలీసులుగా నియమించుకున్నాడు. నాటు తుపాకులు కూడా ఇచ్చాడు. వారు కూడా తాము నిజంగానే పోలీసులం అయిపోయామని సంబరపడ్డారు. తాను డబ్బులు వసూలు చేసిన అనిత, జూలీలకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. మరో ముగ్గురిని తన ముఠాలో కలుపుకుని వారికి డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగాలు ఇచ్చాడు.
నాటు తుపాకులతో రోడ్లపైకి వచ్చిన నకిలీ పోలీసులు వాహనదారులను, జనాన్ని, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజేవారు. ఇలా 8 నెలలపాటు ఈ ‘నకిలీ’ బాగోతం నడిచింది. అయితే, అసలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు బుధవారం నాటు తుపాకులతో నిలబడిన నకిలీ పోలీసులను చూసి అనుమానించాడు. ఆ తర్వాత ఆరా తీయడంతో నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలిసిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.