Indian Railways: తప్పుడు ప్రచారంపై స్పందించిన రైల్వే.. ఐదేళ్లలోపు పిల్లలకు ప్రయాణం ఉచితమేనని స్పష్టీకరణ
- రైల్వే నిబంధనలు సడలించిందంటూ వార్తలు
- రైల్వేపై వెల్లువెత్తిన విమర్శలు
- ఆ వార్తలు ప్రయాణికులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న రైల్వే
- సీటు కానీ, బెర్త్ కానీ కావాలంటేనే టికెట్ తీసుకోవాలని స్పష్టీకరణ
రైళ్లలో ఇకపై ఐదేళ్లలోపు పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలని, ఈ మేరకు రైల్వే నిబంధనలు మార్చిందంటూ వస్తున్న వార్తలపై భారతీయ రైల్వే స్పందించింది. అలాంటిదేమీ లేదని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ఐదేళ్లలోపు చిన్నారులకు రైళ్లలో ప్రయాణం ఉచితమేనని, వారి నుంచి ఎలాంటి టికెట్‌ను వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రయాణికులను ఈ వార్త తప్పుదోవ పట్టించేలా ఉందన్న రైల్వే.. ఐదేళ్లలోపు చిన్నారులకు సీటు కానీ, బెర్త్ కానీ కావాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సిందేనని వివరించింది. లేదంటే ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది.
6 మార్చి 2020న రైల్వేశాఖ ఓ సర్క్యులర్ జారీ చేస్తూ.. ఐదేళ్లలోపు చిన్నారులు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వారికి సీటు కానీ, బెర్త్కానీ ప్రత్యేకంగా కేటాయించరని పేర్కొంది. అయితే, తాజాగా ఆ నిబంధన ఎత్తివేసినట్టు వార్తలు రావడంతో రైల్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే స్పందించి ఈ వివరణ ఇచ్చింది.