Yanamala: కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. కమీషన్ల కోసం ఉన్నవాటిని కూడా తరిమేశారు: యనమల
- యువత నెత్తిపై జగన్ భస్మాసుర హస్తం పెట్టారన్న యనమల
- ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేశారని విమర్శ
- నిరుద్యోగ భృతిని కూడా రద్దు చేశారని వ్యాఖ్య
ఏపీలో దొరల తరహా పాలన నడుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికలకు ముందు యువతకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక యువత నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టారని అన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పైనా, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై జగన్ ను యువత నిలదీయాలని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దినదినం పెరుగుతోందని చెప్పారు.
పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ జగన్ గొప్పలు చెప్పుకున్నారని... ఆయన కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా... కమీషన్ల కోసం ఉన్నవాటిని కూడా తరిమేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే... జగన్ వచ్చాక దాన్ని రద్దు చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు ఉపాధి కల్పించారని... జగన్ వాటిని రద్దు చేసి ఆయా సామాజికవర్గాల పొట్టకొట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదాను జగన్ మర్చిపోయారని దుయ్యబట్టారు.