Asaduddin Owaisi: కశ్మీరీ పండిట్లపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించిన ఒవైసీ
- ఆర్టికల్ 370 రద్దు వల్ల పండిట్లకు మేలు జరుగుతుందన్నారన్న ఒవైసీ
- ఇప్పటికీ పండిట్లు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారని వ్యాఖ్య
- జమ్మూకశ్మీర్ లో కేంద్రం పాలన దారుణంగా విఫలమవుతోందని విమర్శ
కశ్మీర్ పండిట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దారుణంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణే కరవయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీరీ పండిట్లకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... కానీ, ఇప్పటికీ వారు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పారు.
పండిట్లపై దాడులు జరుగుతున్నాయని, హత్యలకు కూడా గురవుతున్నారని అన్నారు. జమ్మూకశ్మీర్ లో బీజేపీ చేత నియమితుడైన లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారని... ప్రధాని మోదీ పాలనే అక్కడ కూడా కొనసాగుతోందని... అయితే, పండిట్ల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో కేంద్రం పాలన దారుణంగా విఫలమవుతోందని అన్నారు.
గుజరాత్ లో బిల్కిస్ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపై ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ నారీశక్తి గురించి మాట్లాడారని... అలాంటప్పుడు ఒక అమ్మాయిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిని విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లో గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్రను నిర్వహించడం అత్యంత దారుణమని ఒవైసీ అన్నారు. మాటల్లో గాంధీ పేరును వాడుతుంటారని... చేతల్లో మాత్రం గాడ్సేపై ప్రేమను చూపిస్తారని మండిపడ్డారు.