Team India: కోచ్ గా ఉన్నప్పుడు ఆ రెండు విషయాలు శాస్త్రికి అస్సలు నచ్చేవి కాదంటున్న దినేశ్ కార్తీక్
- నిర్దిష్ట వేగంతో బ్యాటింగ్ చేయకుంటే ఉపేక్షించేవాడు కాదన్న దినేశ్
- నెట్ ప్రాక్టీస్ కు భిన్నంగా మ్యాచ్ లో ఆడినా సహించేవాడు కాదని వెల్లడి
- శాస్త్రి హయంలో మంచి విజయాలు సాధించిన భారత జట్టు
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మంచి పని తీరు కనబరిచాడు. ఆయన హయాంలో జట్టు చాలా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో వరుసగా టెస్ట్ సిరీస్‌లను గెలవడంతో పాటు మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది. కోచ్‌గా ఉన్న సమయంలో శాస్త్రి జట్టుకు దూకుడు నేర్పించాడు. అయితే, కోచ్ గా ఉన్న సమయంలో శాస్త్రి రెండు విషయాల్లో మాత్రం ఆటగాళ్లను అస్సలు ఉపేక్షించేవాడు కాదని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.
శాస్త్రి తనకు నచ్చని నిర్దిష్ట వేగంతో బ్యాటింగ్ చేయకున్నా, నెట్ ప్రాక్టీస్ కు భిన్నంగా మ్యాచ్‌లో ఏమైనా చేసినా ఆటగాళ్ల పట్ల అసహనం వ్యక్తం చేసేవాడని తెలిపాడు. ‘తాను జట్టు నుంచి ఏమి కోరుకుంటున్నాడో, జట్టు ఎలా ఆడాలో శాస్త్రికి బాగా తెలుసు. కానీ వైఫల్యాలను సహించేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఆటగాళ్లను బాగా ఆడేందుకు ప్రోత్సహించేవారు’ అని కార్తీక్ చెప్పాడు.
శాస్త్రి కోచ్‌గా తన ప్రతిభను నెరవేర్చాడని, ఆశించిన దానికంటే చాలా మెరుగ్గా పని చేశాడని తెలిపాడు.
అదే సమయంలో శాస్త్రికి ఎన్నో వ్యాపకాలు ఉన్నా కూడా కోచ్ గా తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడన్నాడు. ఏవైనా ప్రత్యేకత సాధించాలని ఆటగాళ్లను ప్రోత్సహించాడని చెప్పాడు. ‘బహుశా ఒక ఆటగాడిగా శాస్త్రి అంత ప్రతిభావంతుడు కాకపోయినా, కోచ్‌గా తన ప్రతిభను చాటుకున్న వ్యక్తి అని నేను నమ్మతున్నా. ఆయన అనుకున్న దానికంటే చాలా బాగా పని చేశాడు’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.