Team India: జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత జట్టులో ఒక మార్పు
- ఆగస్టు 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన
- మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు
- వాషింగ్టన్ సుందర్ కు గాయం.. సిరీస్ కి దూరం
- షాబాజ్ అహ్మద్ కు చోటు
ఆగస్టు 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. సుందర్ స్థానంలో బెంగాల్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ కు స్థానం కల్పించారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరమయ్యాడని వెల్లడించింది.
కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్ కు తొలుత శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించిన సెలెక్టర్లు... రెగ్యులర్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో మనసు మార్చుకున్నారు. ధావన్ స్థానంలో జింబాబ్వే సిరీస్ లో టీమిండియా పగ్గాలను రాహుల్ కు అప్పగించారు. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యజువేంద్ర చహల్ లకు విశ్రాంతి కల్పించారు.